ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు 99 శాతం ఇక్కడే ట్రీట్ మెంట్ జరిగేలా వైద్యులు చూడాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. జనవరి 07న ఆయన చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను, గర్భిణులను భయపెట్టి ప్రయివేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారని మండిపడ్డారు. వైద్యులు తమ ధోరణిని మార్చుకోవాలని లేకపోతే ఉద్యోగాలు బంద్ చేయాలని హెచ్చరించారు. పేదల ఆరోగ్య విషయంలో కమిట్మెంట్ తో పనిచేస్తామని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.
ఈ సంవత్సరంలో పిలాయిపల్లి కాలువ ద్వారా రైతులకు సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి... గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం లైనింగ్ కూడా పూర్తి చేయలేదన్నారు. కేవలం దీని ద్వారా కాంట్రాక్టర్ లు మాత్రమే బాగుపడ్డారని చెప్పారు. కాళేశ్వరం నుంచి బస్వాపురం ప్రాజెక్ట్ ద్వారా మంచి నీరు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఫార్మా కంపెనీల యజమానులు, జిల్లా అధికారులు మునుగోడు ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి ఫార్మా కంపెనీ కచ్చితంగా ఎఫ్ లెంట్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ద్వారా అండర్ లైన్ డ్రైనేజీ పార్కులు, చెరువులను రోడ్లను రూపొందించి భావితరాలకు బహుమతిగా అందిస్తామని చెప్పారు. ఇక మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమ్మడం వలన కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ముఖ్యంగా యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులను నిర్మూలించాలని కోరుతున్నట్లుగా రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.