బీజేపీ, బీఆర్ఎస్లతో జాగ్రత్త : ఎమ్మెల్యే సీతక్క

కాంగ్రెస్ చేసే మాటలే చెబుతుంది..కేసీఆర్ లాగా మేం బోగస్ మాటలు చెప్పమని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీతక్క ప్రసంగించారు. సోనియా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. మతం మత్తలో ముంచే బీజేపీతో, మద్యం మత్తులో ముంచే బీఆర్ఎస్ పార్టీలతో జాగ్రత్త అని సూచించారు. రాష్ట్రమంతా మద్యంపై వచ్చే ఆదాయంతోనే నడిచే దుస్థితి నెలకొందన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ సీతక్క కోరారు. చత్తీశ్ గఢ్ లో తమ సీఎం ధాన్యానికి క్వింటాలుకు రూ.2600 ఇస్తున్నారని.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరని సీతక్క ప్రశ్నించారు.

8 ఏళ్లలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియమకాలు నెరవేర్చడంలో సీఎం విఫలమయ్యారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడని మండిపడ్డారు. కాంగ్రెస్ తెచ్చిన ప్రాణహిత చేవేళ్లకు బదులు కమిషన్ల కక్కుర్తి పడి కాళేశ్వరం కట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. చత్తీశ్ ఘడ్ లాగే ఇక్కడ కూడా తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, వరికి అధనంగా రూ. 600 ఇస్తామని వెల్లడించారు. కేసీఆర్ ను గద్దెనెక్కించిన కరీంనగర్ ప్రజలే ఆయన పాలనకు సమాధి కట్టాలని కోరారు.

కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సభకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ హాజరయ్యారు. ఇటు రాష్ట్రం నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గడ్డం వినోద్,  కొండా సురేఖ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, కోదండరెడ్డి, అద్దంకి దయాకర్ తో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, కొప్పుల రాజు, మాణిక్ రావు ఠాక్రే,  సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు. ఈ సభలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాట పడి కాంగ్రెస్ శ్రేణులను అలరించారు.