సెక్రటేరియెట్​లోకి వెళ్లకుండా సీతక్కను అడ్డుకున్నరు

  • ఎమ్మెల్యే వెహికల్​ను గేటు దగ్గరే ఆపేసిన పోలీసులు
  • పర్మిషన్ లేదంటూ 20 నిమిషాలు ఆపిన సిబ్బంది
  • వెహికల్ అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్లిన సీతక్క
  • ప్రతిపక్ష నేతలు రావొద్దని బోర్డు పెట్టుకోండని ఫైర్  

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ లోకి వెళ్లకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీతక్క సెక్రటేరియెట్​లోకి వెళ్తుండగా, అనుమతి లేదంటూ ఆమె వెహికల్​ను గేటు దగ్గరే ఆపేశారు. తానొక ఎమ్మెల్యేనని, నియోజకవర్గ సమస్యలపై ఉన్నతాధి కారులను కలవాల్సి ఉందని చెప్పినా లోపలికి వెళ్లనివ్వలేదు. సెక్రటేరియెట్​లోకి ఎందుకు వెళ్తున్నారు? ఎవరిని కలవాలి? అని సీతక్కను టీఎస్ ఎస్పీ పోలీసులు ప్రశ్నించారు. లోపలికి వెళ్లాలంటే.. ఎవరి దగ్గరికి వెళ్తున్నారో, వారి నుంచి తమకు చెప్పించాలని లేదంటే విజిటర్ పాస్ తీసుకోవాలని, అప్పుడే అనుమతిస్తామని చెప్పారు. అయితే, తనకు ఒక్క దగ్గర పని లేదని మూడు, నాలుగు డిపార్ట్​మెంట్లకు వెళ్లాల్సి ఉందని సీతక్క చెప్పినా పోలీసులు వినిపించు కోలేదు. 20 నిమిషాల పాటు ఆపారు. దీంతో విసిగిపోయిన సీతక్క.. చివరకు తన వాహనాన్ని అక్కడే ఆపేసి నడుచుకుంటూ వెళ్లారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు రానివ్వరు?

సెక్రటేరియెట్​ను అద్భుతంగా నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లో పలికి ఎందుకు అనుమతించడం లేదని సీతక్క ప్రశ్నించారు. సెక్రటేరియెట్​లో పనులు చూసుకుని బయటకు వచ్చినంక సీతక్క మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతులు రావొద్దని సెక్రటేరియెట్ ముందు బోర్డు పెట్టుకోండి అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాగా, హోంమంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ పై చేయిచేసుకోవడంపై సీతక్క మండిపడ్డారు.