Rashmika Mandanna: రష్మిక మందన్నకు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్.. అసలేం జరిగింది?

Rashmika Mandanna: రష్మిక మందన్నకు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్.. అసలేం జరిగింది?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై (Rashmika Mandanna) మాండ్యకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సైతం నటి రష్మిక ప్రవర్తనపై ఫైర్ అయ్యారు. అసలు రష్మికకు, రాజకీయాలకు సంబంధం ఏంటనీ అనుకుంటున్నారా? పూర్తి వివరాలు చూసేద్దాం.

శనివారం మార్చి 1న 16వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అటెండ్ అయ్యారు. అయితే, బెంగళూరు ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభోత్సవానికి గైర్హాజరైన కన్నడ సినీ నటులను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఈ ఫెస్టివల్కు అటెండ్ అవ్వడానికి నిరాకరించినందుకు నటి రష్మిక మందన్నపై డిప్యూటీ సీఎం శివ కుమార్ మండిపడ్డారు. 

" కన్నడ చిత్ర పరిశ్రమ మూలాలను విస్మరించిన నటులు, నిర్మాతలు మరియు దర్శకులు గురించి మాట్లాడుతూ.. " ఇటువంటి మహోత్కర కార్యక్రమాలల్లో పాల్గొని మీ భావాలూ పంచుకోకపోతే, అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వల్ల ప్రయోజనం ఏమిటి? అందులోనూ ప్రభుత్వం ఆహ్వానాలు పంపిన కూడా తిరస్కరించడమేంటనీ డికె శివకుమార్ ప్రశ్నించారు.

దీనిని ఫిల్మ్ చాంబర్ మరియు అకాడమీకి ఒక హెచ్చరిక లేదా అభ్యర్థనగా పరిగణించండి. సినిమా అనేది కొందరికి మాత్రమే కాదు. ప్రభుత్వ మద్దతు కూడా చాలా కీలకం" అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే, కన్నడ చిత్ర పరిశ్రమను విస్మరిస్తున్న వారి స్క్రూలను ఎలా, ఎప్పుడు బిగించాలో తనకు బాగా తెలుసని డిప్యూటీ సీఎం డికె శివకుమార్ అన్నారు. 

అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే గణిగ మాట్లాడుతూ.. "  కన్నడ చిత్ర పరిశ్రమను విస్మరించినందుకు నటి రష్మికకు గుణపాఠం నేర్పకూడదా అని కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత సంవత్సరం బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి మేము ఆమెను ఆహ్వానించినప్పుడు హాజరు కావడానికి నిరాకరించిందని"  గనిగ సోమవారం (మార్చి 3న) విధాన సౌధలో మీడియా ప్రతినిధులతో అన్నారు. అలాగే, రష్మిక మందన్నను ఈ కార్యక్రమానికి చాలాసార్లు ఆహ్వానించామని, కానీ కర్ణాటకను సందర్శించడానికి సమయం లేదని చెప్పి, నిరాకరించిందని ఆయన అన్నారు.

"రష్మిక చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ.. 'నా ఇల్లు హైదరాబాద్‌లో ఉంది, కర్ణాటక ఎక్కడ ఉందో నాకు తెలియదు, నాకు సమయం లేదు. నేను రాలేను' అని. మా శాసనసభ్యుల స్నేహితుల్లో ఒకరు ఆమెను ఆహ్వానించడానికి 10–12 సార్లు ఆమె ఇంటికి వచ్చారు, కానీ ఆమె నిరాకరించిందని చెప్పారు. ఇలాంటి వారికి మనం గుణపాఠం నేర్పకూడదా?" అని గనిగ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2016లో రక్షిత్ శెట్టి సరసన కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీతో' రష్మిక సినీరంగ ప్రవేశం చేసింది.

రష్మిక హైదరాబాద్ వ్యాఖ్యపై ఎదురుదెబ్బ:

రష్మిక మందన్న ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో హైదరాబాద్‌ను తన ఇల్లుగా పేర్కొన్నారు. ఇది కన్నడ వర్గాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. కర్ణాటకలో తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, కొన్ని కన్నడ అనుకూల సంస్థలు ఆమె కన్నడ చిత్ర పరిశ్రమను అగౌరవపరిచాయని ఆరోపించాయి. కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు టిఎ నారాయణ్ గౌడ కూడా రష్మిక వ్యాఖ్యలపై హెచ్చరించారు. అప్పటి నుండి కన్నడ కార్యకర్తలు ఆమెపై ప్రచారం ప్రారంభించారు.