హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కాళేశ్వరం ఎందుకు వెళ్లారని, ఆయన ఏమైనా ఇంజినీరా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని స్టోరేజీ చేస్తే ప్రమాదమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.
అయినా నీటిని స్టోర్ చేయాలని కేటీఆర్ చెబుతున్నారని.. లక్షల మంది జల ప్రళయంలో చనిపోవాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా బీఆర్ఎస్ ను బొందపెట్టినా వాళ్లకు ఇంకా బుద్ధిరాలేదని ధ్వజమెత్తారు. హరీశ్ మేధావి కాబట్టే కేటీఆర్ చేపట్టిన టూర్ కు ఆయన దూరంగా ఉన్నారని చెప్పారు.
ఇరిగేషన్ మాజీ మంత్రిగా ఆయనకు అందులో జరిగిన తప్పులన్ని తెలుసన్నారు. తెలంగాణకు ఇంకా కేసీఆర్ కుటుంబ శని వదల్లేదని, అందుకే బీఆర్ఎస్ తెగులును భూస్థాపితం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.