
- రోజుకు మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అటెండెన్స్
- విప్ లు, ఎమ్మెల్యే జయవీర్ పై సీఎం ఆగ్రహంతో మారిన సీన్
- లంచ్ టైమ్‌లోనూ సభ నుంచి బయటకు వచ్చే సాహసం చేయని మంత్రులు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో శనివారం ‘క్లాస్ రూమ్’ తరహా వాతావరణం కనిపించింది. స్కూళ్లలో స్టూడెంట్లకు ఉదయం, మధ్యాహ్నం అటెండెన్స్ తీసుకున్నట్లే.. అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శనివారం అటెండెన్స్ తీసుకున్నారు. స్కూళ్లల్లో రెండు పూటలే అటెండెన్స్ తీసుకుంటే అసెంబ్లీలో ఇంకో పూట ఎక్కువే తీసుకున్నారు. ఇకపై జరిగే అన్ని అసెంబ్లీ సమావేశాలకు రోజుకు మూడు పూటలు అటెండెన్స్ తీసుకుంటామని విప్‌లు చెప్తున్నారు.
ఈ డిసిప్లీన్ ఒక్క అటెండెన్స్ తోనే ఆగిపోలేదు. క్లాస్ రూమ్ లో టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు విద్యార్థులెవరూ బయటకు రాకుండా ఎలా శ్రద్ధగా పాఠాలు వింటారో.. అలాంటి సీనే శనివారం అసెంబ్లీలో సీఎం ప్రసంగం సందర్భంగా కనిపించింది. అయితే, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఇంత క్రమశిక్షణతో వ్యవహరించడం వెనుక 3రోజుల క్రితం సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకోవడమే అసలు కారణం కావడం గమనార్హం.
ఇంతకూ ఏం జరిగిందంటే..
మూడ్రోజుల క్రితం అసెంబ్లీలోని కమిటీ హాల్లో సీఎల్పీ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా మాట్లాడుతున్న టైంలో నల్గొండకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మొబైల్ ఫోన్ చూస్తూ బయటకు వెళ్లిపోయారు. ఇది చూసిన రేవంత్‌కు చిర్రెత్తుకొచ్చింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, బీఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై తాను ఇంత సీరియస్‌గా చెప్తుంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అలా నాన్ సీరియస్ గా బయటకు వెళ్లిపోవడం ఏమిటని అక్కడే సీఎం ఫైర్ అయ్యారు.
అంతకుముందు ప్రభుత్వ విప్ లు, సీనియర్ ఎమ్మెల్యేల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాన్‌స్టాప్‌గా సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే.. వారి ఆరోపణలను తిప్పికొట్టడంలో పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ఫెయిల్ కావడంపై సీఎం సీరియస్ అయ్యారు. కొద్దిసేపటికే సీఎల్పీ మీటింగ్ లో జయవీర్ వ్యవహరించిన తీరుతో పుండు మీద కారం చల్లినట్లయింది.
దీంతో మండిపడిన ఆయన.. ‘రేపటి నుంచి అసెంబ్లీలో రోజుకు 3సార్లు అటెండెన్స్ తీసుకోండి..’ అంటూ విప్‌లను ఆదేశించారు. ఫలితంగా ఆ మరుసటి రోజు నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అటెండెన్స్ షురువైంది. అందుకే శనివారం లంచ్ సమయంలో కూడా సభ జరుగుతున్నప్పుడు హౌజ్ నుంచి బయటకు వచ్చేందుకు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలెవరూ సాహసించలేదు. సీఎం మాట్లాడుతున్నా.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒంటి గంట కాగానే హౌజ్ నుంచి బయటకు వచ్చి లంచ్ చేసేవారు. కానీ శనివారం సభ వాయిదాపడే వరకు (మధ్యాహ్నం 3. 45 నిమిషాల వరకు) ఏ ఒక్క మంత్రిగానీ, పార్టీ ఎమ్మెల్యే గానీ బయటకు రాలేదు. అందరూ సీఎం స్పీచ్ ను ఆసక్తిగా విన్నారు.