వీసీల నియామకాల్లో దళితులకు ప్రాధాన్యం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

వీసీల నియామకాల్లో దళితులకు ప్రాధాన్యం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • కేటీఆర్​ అహంకారంతో మాట్లాడుతున్నరు
  • కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అడ్లూరి, కవ్వంపల్లి, సామేల్​ ఫైర్​

హైదరాబాద్, వెలుగు: వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్​ధన్యవాదాలు తెలిపారు. శనివారం సీఎల్పీ మీడియా పాయింట్​లో అడ్లూరి లక్ష్మణ్​ మాట్లాడుతూ.. ఓయూ చరిత్రలో ఇప్పటి వరకు దళితుడు వీసీ కాలేదని, మహిళా వర్సిటీకి గిరిజన మహిళను వీసీగా నియమించారన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. 

సత్యనారాయణ మాట్లాడుతూ..వీసీల నియామకంలో ప్రాధాన్యమిచ్చి దళితులపై సీఎం అభిమానాన్ని చాటుకున్నారన్నారు. కేటీఆర్ తో స్పెల్లింగ్ ఛాలెంజ్ కు తాను సిద్ధమని ప్రతి సవాల్​ విసిరారు. కేటీఆర్ కు ఇక్కడ సీటు రాక అమెరికా పోయి చదువుకున్నాడన్నారు. 2009లో 70 ఓట్లతో గెలిచిన విషయం మరిచిపోవద్దని, పదేండ్లలో మున్సిపల్ మంత్రిగా ఉండి మూసీలో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు.  నిరుద్యోగ యువత ను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. 

మందుల సామేల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ సర్కార్ ఉస్మానియా యూనివర్సిటీ, బాసర త్రిబుల్​ ఐటీ వీసీలను మాదిగలను నియమించిందన్నారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం వేసిందని గుర్తు చేశారు.  ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను కూడా ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. బండి సంజయ్ దేశానికి మంత్రా? లేక హైదరాబాద్ కి మంత్రా?అని ప్రశ్నించారు. 

ఆయన దేశ సమస్యల మీద పోరాటం చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిని ముట్టుకునే దమ్ము బీఆర్​ఎస్​ లేదని హెచ్చరించారు. బీఆర్​ఎస్​ అధ్యక్ష పదవికోసం బావాబామ్మర్ది కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.