
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ అయితే.. ఆ పార్టీ ఓనర్ కొడుకు కేటీఆర్ విలనా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఓనర్ కొడుకు విలన్ అని, అందుకే కేటీఆర్ కూడా బీఆర్ఎస్ లో విలనా అని అన్నారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రజతోత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని దయాకర్డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ కుటుంబం నుంచి కాకుండా వేరే వెలమకైనా ఈ పదవి ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన రెండేండ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారని.. కేటీఆర్ కు దమ్ముంటే బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి తీసుకొని రెండేండ్లలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయితే.. దానికి జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు ఎవరో చెప్పాలన్నారు. కేటీఆర్ ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటా? నాన్ వర్కింగ్ ప్రెసిడెంటా? అనేది ఆయనకే తెలియాలన్నారు. కమలం పువ్వు కాడకు గులాబీ పువ్వును అంటగడుతున్నారని, తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ కోసమే బతుకుతోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సభకు జనాన్ని తరలించేందుకు రూ.300 కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.