
- బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలది మొసలి కన్నీరు: ఎమ్మెల్సీ అద్దంకి
న్యూఢిల్లీ, వెలుగు: హెచ్‌సీయూ భూములపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే నడుచుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఈ వ్యవహారంలో ఏదైనా పొరపాటు జరిగితే సరి చేసుకుంటామన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. హెచ్‌సీయూ భూములపై బీజేపీ, బీఆర్‌ఎస్ మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో వేల ఎకరాలను బీఆర్ఎస్ సేకరించిందని గుర్తుచేశారు.
అలాగే దాదాపు పదేండ్ల పాలనలో ఏటా సరాసరిగా రూ.80 వేల కోట్లను అప్పుగా తేవడంతో పాటు.. విలువైన భూములు అమ్మకానికి పెట్టిందన్నారు. ఇందుకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ లను మీడియాకు చూపారు. అయితే తాము పర్యావరణాన్ని కాపాడుతూనే అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కానీ ఈ విషయంలో కేటీ-ఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్.. హెచ్‌సీయూ భూములపై ఆల్ పార్టీ మీటింగ్ వస్తారా? చర్చకు తాము సిద్ధమన్నారు.
అవసరమైతే సీఎం రేవంత్‌తో మాట్లాడి సమావేశం ఏర్పాటు- చేస్తానని వెల్లడించారు. కిషన్ రెడ్డికి రాష్ట్రం పట్ల కమి-ట్-మెంట్ లేదని విమర్శించారు. గుత్తి కోయలను బట్టలు విప్పి కొట్టించిన కేటీ-ఆర్, అటవీ భూముల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 42% బీసీ రిజర్వేషన్లలో కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు రిజర్వేషన్లు వద్దని అంటారా బీజేపీ నేతలు చెప్పాలి ? అని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌తో బతుకులు నాశనం అవుతున్నా కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి తెలియడం లేదన్నారు.