తప్పు చేసినోళ్లంతా జైలుకు పోవాల్సిందే : బల్మూరి

తప్పు చేసినోళ్లంతా జైలుకు పోవాల్సిందే : బల్మూరి
  • కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టే జైలుకు పోతా అంటుండు: బల్మూరి

హైదరాబాద్, వెలుగు: తప్పు చేసిన వారు ఎవరైనా సరే జైలుకు పోవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టే కటకటాలకు పోతా అంటుండని చెప్పారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయంపై కేటీఆర్ ను పదేండ్లుగా ప్రశ్నిస్తున్నా స్పందించలేదన్నారు. కానీ, ఇప్పుడు దీనిపై ప్రజలకు స్పష్టత వచ్చిందన్నారు. తాను మంత్రినని, ఏది చేస్తే అది నడుస్తుందనే అహంభావంతో ఎలాంటి అనుమతి లేకుండా ఫార్ములా వన్ కు నిధులు కేటాయించాడని ఫైర్ అయ్యారు. 

దేనికైనా ఒక ప్రణాళిక ఉంటుందని, తాను మున్సిపల్ శాఖ మంత్రిని, తన తండ్రి సీఎం అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎంతమాత్రం నడవదని అన్నారు. ఇలాంటి అహంకారపు వ్యవహారాలతోనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్న విషయం తెలుసుకోవాలన్నారు.

అధికారం కోల్పోతే మతిస్థిమితం కోల్పోయినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ పై వెంటక్​ఫైర్ అయ్యారు. ఫార్ములా వన్ తో హైదరాబాద్ డెవలప్ అవుతుందనే పేరుతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకున్నాడని ఆరోపించారు. ఫార్ములా వన్ కంపెనీతో కేటీఆర్ కు లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే జైలుకు పోవడానికైనా సిద్ధం అని కేటీఆర్ అంటున్నాడని అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకొని నిజాలు మాట్లాడాలని సూచించారు. బావా బామ్మర్దుల మధ్య పార్టీలో కుర్చీ కోసం కొట్లాట నడుస్తోందని వెంకట్​ఆరోపించారు.