జగిత్యాల జిల్లా: రాష్ట్రంలోని నిరుపేద రైతులందరికీ రైతు బీమా కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని సారంగపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది దాకా రైతులు ఉంటే 35 లక్షల మందికి మాత్రమే రైతు బీమా వస్తోందని తెలిపారు. మిగతా రైతులకు కూడా రైతు బీమాను వర్తింపజేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేదని విధంగా తాము రైతు బంధు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే రైతు బంధు ద్వారా వచ్చే ఆర్ధిక నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆయన నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు.
అలాగే ప్రభుత్వం ఇచ్చే రాయితీల్లో కూడా కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో రైతులకు వ్యవసాయం భారంగా మారిందని, మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ డ్రామాలాడుతున్నారని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.