ఏం చేశారని బైక్​ ర్యాలీలు? : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ఎమ్మెల్యే రసమయిపై ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి ఫైర్  

మానకొండూరు అభివృద్ధిపై సీఎం దృష్టి పెట్టాలని డిమాండ్​ 

కరీంనగర్, వెలుగు : ఏం ఘనకార్యం చేశారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ బైక్​ ర్యాలీలు నిర్వహించారని ఎమ్మెల్సీ, కాంగ్రెస్​ లీడర్​ జీవన్​రెడ్డి ప్రశ్నించారు. డీసీసీ ప్రెసిడెంట్​ కవ్వంపల్లి సత్యనారాయణను జైల్లో పెట్టించినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని నిలదీశారు. సోమవారం కరీంనగర్​ డీసీసీ ఆఫీసులో పొన్నం ప్రభాకర్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా,  ఎన్ని రోజులు జైలుకు పంపినా  కాంగ్రెస్​ వెనుకడుగు వేయదన్నారు.

ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తే ప్రజలు టీఆర్ఎస్ ను తరిమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్కడికి వచ్చి రసమయి రెచ్చగొట్టారని అన్నారు. గుండ్లపల్లికి డబుల్ రోడ్ మంజూరు చేయాలని, చొక్కారావుపల్లి నుంచి చింతకుంట మధ్య బ్రిడ్జి నిర్మించాలని, గన్నేరువరంలో పీహెచ్ సీ ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఎమ్మెల్యే రసమయికి మద్దతుగా ఉన్న వినోద్ కుమార్, సుడా చైర్మన్లయినా ఇందుకు చొరవ చూపాలని.. లేదంటే సీఎం కేసీఆరే మానకొండూరు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని అన్నారు.   

19న పాదయాత్ర– పొన్నం   

ఈనెల 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించి, గన్నేరువరం చౌరస్తా నుంచి  గుండ్లపల్లి స్టేజి వరకు పాదయాత్ర -చేపడతామని మాజీ ఎంపీ  పొన్నం ప్రభాకర్ అన్నారు.  అధికార పార్టీ చేసిన వాగ్దానాలు,  చేసిన కబ్జాలు,  లాఠీచార్జిలను,  అభివృద్ధి,  అవినీతిపైన చర్చించడానికి   సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు.