- హుజురాబాద్, మునుగోడులను రెండూ ఒకేలా చూడలేం
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా: రాష్ట్ర రాజకీయాలపై, నేతలు పార్టీలు మారడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందర్నీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాదని, పీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమేనని.. ఆయన పరిధి మేరకు పని చేస్తున్నారని చెప్పారు. తామంతా సోనియాగాంధీ నాయకత్వంలో పని చేస్తున్నామని పేర్కొన్నారు. జగిత్యాలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తమకు తెలియదన్నారు.
నేతల చేరికలతో పార్టీలు బలపడవు
పార్టీలు మారే నేతలంతా తమ వ్యక్తి గత ప్రయోజనాల కోసమే చేరుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరింది ఆ పార్టీ కోసం కాదని, తన రాజకీయ రక్షణ కోసమే వెళ్లారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే.. బీజేపీ కూడా అదే చేస్తోందని, ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపించారు. రాజకీయ కోణంలో టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం తప్ప..బీజేపీ చేసేదేమీ ఉండదన్నారు. నేతల చేరికలతో పార్టీలు బలపడవని జీవన్ రెడ్డి అన్నారు.
దాసోజు శ్రవణ్ పార్టీ వీడటం బాధాకరం
ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రావణ్.. కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దాసోజు శ్రావణ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగేలా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికలతో నియోజకవర్గాలు అభివృద్ధి చెందవని, హుజురాబాద్, మునుగోడులను రెండూ ఒకేలా చూడలేమని చెప్పారు. తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీకి ప్రజల మద్దతు లేదన్నారు. టీఆర్ఎస్ తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో తనపై కూడా కొంతమంది నేతలకు అసంతృప్తి ఉంటే ఉండొచ్చని, అది కామన్ అంటూ కామెంట్స్ చేశారు.