కేటీఆర్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నరు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  • బండి సంజయ్ దర్యాప్తు సంస్థలను అవమానిస్తున్నడు: జీవన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: సీఎం పదవికి ఏ విధమైన గౌరవం ఇవ్వాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలుసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియాతో  మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్యాప్తు సంస్థలను అవమానించేలా మాట్లాడిన తీరు బాగా లేదన్నారు. 

కేటీఆర్ క్రాక్.. బండి సంజయ్ మెంటల్:  సంపత్ కుమార్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ క్రాక్ అని, బండి సంజయ్ ఓ మెంటల్ అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్​పై కేటీఆర్ వాడుతున్న భాష రాజకీయాలకు తలవంపులు తెచ్చే విధంగా ఉందన్నారు. కేసులన్ని మెడకు చుట్టుకోవడంతో కేటీఆర్ క్రాక్​లా  ప్రవరిస్తున్నారని  ఆరోపించారు.     
 
జబర్దస్త్ కామెడీ షో మాదిరిగా ఆయన తీరు: రామ్మోహన్ రెడ్డి

ఏసీబీ విచారణ సందర్భంగా కేటీఆర్ వ్యవహరించిన తీరు జబర్దస్త్ కామెడీ షోలా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే  రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన  మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ జైలుకెళ్లడం, చిప్పకూడు తినడం ఖాయమన్నారు. కాగా, అధికారాన్ని అడ్డంపెట్టుకొని అడ్డు, అదుపు లేకుండా తెలంగాణ సొమ్మును దోచుకున్న కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు త్వరలోనే తీహార్ జైలుకు పోకతప్పదని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం తెలిపారు.