
హైదరాబాద్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులను అధిగమించి బడ్జెట్‌ను రూపొందించామని, ఈ బడ్జెట్ దేశానికే ఆదర్శమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన గురువారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన బడ్జెట్ ఇది అని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ సంక్షేమ పథకాన్ని కూడా నిలిపివేయకుండా కొనసాగిస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు.
బీఆర్ఎస్ సర్కారు రుణమాఫీ చేయకుండా కేవలం వాటి వడ్డీని మాత్రమే మాఫీ చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, పదేండ్లుగా కేటీఆర్, హరీశ్‌రావు రాజుల్లాగా వ్యవహరించారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి తప్ప మంత్రులకు ఏమైనా పవర్ ఉండేదా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం కుల గణన, వర్గీకరణ చేసిందని చెప్పారు