కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవిపై వ్యామోహం తప్ప ధర్మపురి నియోజకవర్గ ప్రజల కష్టాలపై ఆలోచన లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేయిస్తున్నారన్నారు. మేఘా కృష్ణారెడ్డి కోసం ధర్మపురిని నిండా ముంచాడని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా రాజారాంపల్లెలో కాంగ్రెస్ ఆఫీస్ను ఆయన ప్రారంభించారు. బలమైన కార్యకర్తలు ఉండడం కాంగ్రెస్ అదృష్టమన్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధానం కాదు ప్రజలకు ఎవరు ఏం చేస్తున్నారన్నదే ముఖ్యమని చెప్పారు.
ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు ఆర్భాటాలు చెప్పుకోవడం తప్ప.. ఇచ్చేది 9 గంటలేనని జీవన్ రెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్ తో రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలు కొనసాగిస్తూ.. రైతుబంధును పక్కాగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న రెండు లక్షల గర్ల్ ప్రొటెక్షన్ స్కీం నిలిపివేసి కళ్యాణలక్ష్మీ ఇస్తున్నారని ఆరోపించారు.
అకాల వర్షాలకు రోళ్ళవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోతే పట్టించుకున్ననాథుడే లేడని.. దీంతో 20 వేల ఎకరాల పంట ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. బతుకమ్మ చీరలు బాగాలేకపోవడంతో మహిళలు వాటిని కూరగాయల తోటలకు వాడుతున్నారని తెలిపారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కాదు.. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు.