నిరుపేదలకు ఉచిత వైద్యం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్య శ్రీ నిర్వీర్యం చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో ఆయన పర్యటించారు. ఆసరా పింఛన్లు 2 వేలు, వికలాంగులకు 3 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోను టీఆర్ఎస్ అనుసరించిందన్నారు. పింఛన్ల మంజూరులో సీఎం కేసీఆర్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
నిలిపివేసిన పింఛన్ల స్థానాల్లోనే కొత్త పింఛన్లు ఇస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. గతంతో పోల్చుకుంటే నిర్మాణవ్యయం ఇప్పుడు రెట్టింపయ్యిందని.. అయినా ప్రభుత్వం మాత్రం సొంత స్థలాలున్నవారికి ఇల్లు కట్టుకునేందుకు మూడు లక్షల ఇస్తామనడం విడ్డూరమన్నారు. రైతుబంధు ఇచ్చే వంకతో విత్తనరాయితీ, ఇతర వ్యవసాయ సబ్సిడీలు ఎత్తివేశారని విమర్శించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారని మండిపడ్డారు.