కనీసం విటమిన్ టాబ్లెట్లు లేకపోవడం ఏంటి ?

కనీసం విటమిన్ టాబ్లెట్లు లేకపోవడం ఏంటి ?
  • రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్  

జగిత్యాల:  రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సంరక్షకులతో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బందితో కలిసి వార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవన్న విషయాన్ని గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా ఎప్పుడైనా అర్ధాంతరంగా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా ఇన్వర్టర్ సదుపాయం ఉండాలి కదా.. ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. సాధారణ రోగాలకు కూడా మందు బిళ్లలు ఇవ్వడం లేదని పలువురు రోగులు చేసిన ఫిర్యాదును వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఆస్పత్రిలో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు ఉండాలి. మీ వద్ద లేకపోతే స్టాకు పంపమని రాయాలి కదా..? డ్రగ్స్ కంట్రోలర్ కు రాస్తే, ప్రభుత్వానికి రాశాం ఇంకా రాలేదని చెప్పి మిన్నకుండిపోతే ఎలా ?’’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. 

అన్ని రుగ్మతలకు చికిత్స చేయాలి

‘వైద్యం అనేది ఈ రోజుల్లో ఖరీదైపోయింది.. సామాన్యులు, పేదలకు ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. ఇక్కడ అన్ని రుగ్మతలకు చికిత్స చేసేలా సదుపాయాలు ఉండాలి. కానీ, ఏవీ కనిపించడం లేదు’ అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, అధికారులు కనీస బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. గర్భిణులు, ప్రసవాలు చేస్తున్నప్పుడు పుట్టిన చిన్నారులకు చికిత్స అందించేందుకు పిల్లల వైద్యులు కూడా అందుబాటులో ఉండాలి కదా.. లేరని చెప్పి ఊరికే ఉండిపోతే ఎలా అని ప్రశ్నించారు. డెంగీ జ్వరాలతో ప్రజలు ఓవైపు మరణిస్తూ ఉంటే ప్రభుత్వాసుపత్రిలో కనీసం మల్టీ విటమిన్ టాబ్లెట్లు కూడా లేవు. మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలైనా ఎందుకు పెట్టడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా అధికారులను నిలదీశారు. జిల్లా కలెక్టర్ రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టి వైద్య చికిత్సకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.