- ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు : ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా? అని ఆయన నిలదీశారు.
రాష్ట్రంలో నియంత పాలన ఉండదని, అందరితో చర్చించాకే సీఎం నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ప్రజల కోరిక మేరకు రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి లోటుపాట్లు, అభ్యంతరాలు లేకుండా చిహ్నం రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఆవిర్భావ వేడుకలకు అమరవీరుల కుటుంబాలను పిలిచి సముచిత స్థాయిలో సత్కరిస్తామని వెల్లడించారు. ఉద్యమంలో పాల్గొన్న అందరికీ ఆహ్వానం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.