కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్‌హౌస్ కేసు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తోంది. ఇరు పార్టీల నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. జన్వాడ ఫామ్‍హౌస్ దాడిలో పోలీసులు కొంత విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు.. విజయ్ మద్దూరి అనే వ్యక్తి శరీరంలో డ్రగ్స్(కొకైన్) ఆనవాళ్లను గుర్తించడంతో ఈ వివాదం మొదలైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్ చేయాలె
మంగళవారం(అక్టోబర్ 29) ఈ విషయంపై మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ వ్యవహారం బయటికొచ్చిన ప్రతి సారి ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బయటికొచ్చి ఒకే మాట మాట్లాడుతుండటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సిగ్గు, శరం ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని నిలదీశారు.
మేము సిద్ధం.. కౌశిక్ రెడ్డి
రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖలపై స్పందించిన కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నేతల సవాల్ ను తాము స్వీకరిస్తున్నట్లు తెలిపాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమా అంటూ సవాల్ విసిరాడు. ఏ ఆస్పత్రికైనా అందరం కలిసి వెళ్దాం అంటూ ఛాలెంజ్ విసిరారు.
ఏమాయే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వస్తా అన్నావ్..
డ్రగ్స్ టెస్ట్ చేపించుకోవడానికి ఏ ఆస్పత్రికైనా అందరం కలిసి వెళ్దాం అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్వీకరించారు. కౌశిక్ రెడ్డి చెప్పినట్లు టెస్ట్ శాంపిల్స్ ఇవ్వడానికి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్ నేతలిద్దరూ ఏఐజీ హాస్పిటల్‌కు చేరుకున్నారు. తీరా అక్కడకు వెళ్ళాక కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు కనిపించకపోవడంతో వారు అవాక్కయ్యారు. చిన్న బాస్ కేటీఆర్, పెద్ద బాస్ కేసీఆర్‌ని తీసుకొస్తా అన్న కౌశిక్ రెడ్డి ఎక్కడని వారు ప్రశ్నించారు. దాదాపు రెండు గంటల పాటు బీఆర్ఎస్ నేతల కోసం వారు ఎదురు చూశారు. తీరా వారు రాకపోయేసరికి అక్కడి నుంచి వెనుదిరిగారు.
ALSO READ | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్ చేయాలె: అనిల్ కుమార్ యాదవ్