రేప్ కేసులో యూపీ కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్

రేప్ కేసులో యూపీ కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్

లక్నో: అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్​కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్​అరెస్టయ్యారు. గురువారం సీతాపూర్​లో విలేకరులతో మాట్లాడుతుండగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ రాకేశ్ తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేండ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఈ ఏడాది జనవరి 17న ఓ మహిళ ఫిర్యాదు చేశారు. 

దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్​ను కూడా సమర్పించడంతో పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎంపీ బుధవారం అలహాబాద్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్​ వేశారు. ఆ బెయిల్​ను తిరస్కరించిన కోర్టు.. రెండు వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఎంపీని ఆదేశించింది. 

ఈ తీర్పు వచ్చిన మరుసటిరోజే పోలీసులు రాకేశ్ రాథోడ్​ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో ఎంపీ అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, భారీ బందోబస్తు నడుమ ఆయనను పోలీసులు కోర్టుకు తరలించారు.