మహబూబ్‌నగర్, వెలుగు: ‘పాలమూరు న్యాయయాత్ర’లో ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయతను మరిచిపోలేనని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ చల్లా వంశీచంద్ రెడ్డి తెలిపారు. కల్వకుర్తి నుంచి మహబూబ్‌నగర్‌కు ఓటు బదలాయింపు కోసం అర్బన్ తహసీల్దార్ ఆఫీస్‌లో శుక్రవారం దరఖాస్తు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం శేరిఅప్పారెడ్డిపల్లిలో ఉన్న తన ఓటుతో పాటు భార్య ఆశ్లేశారెడ్డి ఓటును మహబూబ్‌నగర్ పట్టణానికి బదాలాయించుకుంటున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ ప్రజలు తనను ఆదరించి ఎంపీగా గెలిపిస్తే, పూర్తి సమయాన్ని నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి కేటాయిస్తానని చెప్పారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఏ వినోద్ కుమార్, మీడియాసెల్ జిల్లా కన్వీనర్ సీజే బెనహర్ ఉన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు అండగా ఉంటా..
విద్యుత్ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పాలమూరు ఎంపీ క్యాండిడేట్ వంశీచంద్ రెడ్డి తెలిపారు. ఐఎన్టీయూసీ ఆఫీస్‌లో జరిగిన విద్యుత్ ఉద్యోగుల సమావేశానికి హాజరై మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, కొత్త పీఆర్సీ, ప్రమోషన్లు, యూనియన్ బిల్డింగ్ నిర్మాణం కోసం స్థలం కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీపీసీసీ సెక్రటరీ వినోద్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బాబయ్య నాయక్, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు రాములు యాదవ్, సెక్రటరీ శ్రీనివాస్, సాయిబాబా, ఉదయ్ కుమార్, బలరాం పాల్గొన్నారు.