కాలభైరవుడిని దర్శించుకున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ

కాలభైరవుడిని దర్శించుకున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ

మంచిర్యాల జిల్లాలో ఏప్రిల్ 20వ తేదీ శనివారం పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పర్యటించారు. ఈరోజు ఉదయం కోటపల్లి మండలం పారిపెల్లి గ్రామంలోని కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వంశీ కృష్ణ. ఈ సందర్భంగా ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. మొట్టమొదటి సారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు వంశీ కృష్ణ తెలిపారు. అనంతరం మండలంలోని రాపనపల్లి గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వాటర్ సప్లై తీరును పరిశీలించారు.

గ్రామస్తులు వేసుకున్న బోర్వెల్ తోనే త్రాగు నీళ్లు అందుతున్నాయని.. వేల కోట్లు ఖర్చు పెట్టినా మిషన్ భగీరథ ద్వారా ఏ ఒక్క ఇంటికి చుక్క నీరు అందడం లేదన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు. తనను ఎంపీగా గెలిపిస్తే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి.. అభివృద్ధి చేస్తానని వంశీ హామీ ఇచ్చారు.