ఆర్మూర్, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆర్మూర్టు ఆదిలాబాద్ రైల్వే లైన్ వేయించలేని అసమర్ధుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. తాను గెలిచిన వెంటనే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ వేయిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆర్మూర్ లో జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
బీజేపీ నేతలకు పనిచేసే సంకల్పం లేదని విమర్శించారు. ఆర్థిక ప్రణాళిక లేకుండానే ముందుకు పోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. పద్మశాలీ సమాజాభివృద్ధికి కృషి చేయడం తన బాధ్యత అని అన్నారు. పద్మశాలీ కల్యాణ మండపం, టౌన్ బిల్డింగ్కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి ఎంపీ గా గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్మూర్ మండలం పిప్రి, గోవింద్ పేట్ గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్లో చేరిన పద్మశాలీ ప్రతినిధులు
పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనం అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పద్మశాలీ ప్రతినిధులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆర్మూర్ పట్టణ పద్మశాలీ సంఘం ప్రెసిడెంట్ అంబల్ల శ్రీనివాస్, మామిడిపల్లి సంఘం ప్రెసిడెంట్ డిష్ రాము, ఆర్మూర్ నియోజకవర్గ పద్మశాలీ సంఘం ప్రెసిడెంట్ దాసరి సునీల్, మాజీ కౌన్సిలర్ రమేశ్ కాంగ్రెస్లో చేరారు.