కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు తీవ్ర గాయాలు

ఆసిఫాబాద్:  ఆదిలాబాద్  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్  తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆదిలాబాద్ కు తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి మావల వద్ద ఆయన కారు  చెట్టును ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో కారు ముందు సీట్లో కూర్చున్న రమేష్ రాథోడ్ కు తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు  వెంటనే ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రమేష్ రాథోడ్ ను పరీక్షించిన డాక్టర్లు పక్కటెముకలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని..ప్రాణాపాయం ఏమి లేదన్నారు.  మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలనుకుంటున్నట్లు చెప్పారు డాక్టర్లు. ఈ విషయం తెలుసుకున్న రమేష్  రాడ్ రమేష్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రిమ్స్ కు  చేరుకుంటున్నారు.

ఉట్నూర్ నుండి ఆదిలాబాద్ కు వస్తుండగా సడెన్ గా పందులు అడ్డం వచ్చాయని వాటిని తప్పించే క్రమంలోనే వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు డ్రైవర్ చెప్పారు. ప్రమాదం సమయంలో కారులో రమేష్ రాథోడ్ తో పాటు ఐదుగురు ఉన్నామని అన్నారు.