మంచిర్యాల: కాంగ్రెస్ హయాంలో దేశంలో పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాకా వెంకటస్వామిదన్నారు పెద్దపల్లి ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ. ఏప్రిల్ 27వ తేదీ శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఎమ్మేల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కార్మిక గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్ని, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. తొలి తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయాలను కూడా లెక్కచేయని వ్యక్తి కాక వెంకటస్వామి అని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక అని అన్నారు. కాకా స్ఫూర్తితోనే మంచి చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తాను చార్జింగ్ బైక్ కనిపెట్టి అందులో 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానన్నారు. తననను గెలిపిస్తే పార్లమెంట్ లో పోరాడి..ఈ జిల్లాకు మరిన్ని నిధులు తీసుకొస్తానని ఆయన చెప్పారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలు కూడా తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకు మంచిగా చదువుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. మీ ఇంట్లో చిన్న కొడుకులా భావించి ఆశీర్వాదిస్తే.. అభివృద్ధి చేస్తానని వంశీ అన్నారు.