- కేటీఆర్ సమాధానం చెప్పాలి
హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలు ఎవరివైనా సరే కూలగొట్టాలని చెప్పిన కేటీఆర్.. ఇంకో వైపు జన్వాడ ఫామ్ హౌస్ పై స్టే కోసం కోర్టుకు పోయిండని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మరి ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ భవన్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లో ఎవరి నిర్మాణాలు ఉన్నా కూలగొట్టాల్సిందేనని అన్నారు. హైడ్రా పారదర్శకంగా పని చేస్తుందని, ఒకవేళ పేదలకు అన్యాయం జరిగితే.. వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.
పదేండ్లు అధికారంలో ఉండి జన్వాడ ఫామ్‌హౌస్ ను లీజుకు తీసుకున్నామని కేటీఆర్ అన్నప్పుడే.. వాళ్ల పరిస్థితి ఏం టనేది అర్థమైందని చెప్పారు. ఫిరంగి కాల్వలను పూడ్చి ఫాంహౌస్ కట్టారని, దీనిపై ప్రజలకు వాస్తవాలను చెప్పాలని చూసిన రేవంత్ రెడ్డిని నాడు తీవ్రవాదులు ఉండే జైల్లో పెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు, పది నెలలు కూడా కానీ తమ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల తీరును చేసి ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రోడ్డు మీద పెట్టాలని కేసీఆర్ చూస్తే.. తాము మాత్రం సెక్రటేరియట్ లోపల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.