
న్యూఢిల్లీ, వెలుగు: గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏబీవీపీలోని స్టూడెంట్స్‌ను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నాయని ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ఆ భూమి తెలంగాణ ప్రభుత్వం సొంతమని అప్పటి రిజిస్ట్రార్ సంతకం చేశారని గుర్తు చేశారు. అయితే 50 ఎకరాల్లో మై హోమ్ కట్టిన విహంగా ప్రాజెక్టు ఉందని, మరి ఆ భూమిని గత బీఆర్ఎస్ హయాంలో మైం హోమ్‌కు ఎలా కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2004 నుంచి ఖాళీగా ఉండడం వల్లే మొక్కలు మొలిచి అడవిగా మారిందన్నారు.
మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ మీడియాతో మాట్లాడారు. ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఉండాలనేది రాహుల్ గాంధీ ఆలోచన అని, భారత్ జోడో యాత్రలో భాగంగా అదే వాగ్దానం చేశారని గుర్తు చేశారు. అందులో భాగంగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తొలి అడుగు వేసిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నామని, మద్దతివ్వాలని పార్లమెంట్లో పలు పార్టీలను మల్లు రవి, అనిల్ ఆహ్వానించినట్టు చెప్పారు.
రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకున్నారు: మల్లు రవి
బీసీల న్యాయమైన హక్కుల కోసం చేపడుతున్న ‘బీసీల పోరు గర్జన’కు అందరూ మద్దతివ్వాలని ఎంపీ మల్లు రవి కోరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. గతంలో కరుణానిధి, ములాయం సింగ్, లాలూ యాదవ్ సైతం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం చేశారన్నారు. వెనకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమ భాగం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంఘాల నాయకులందరితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు
ఎంపీ అనిల్ తెలిపారు.