
- వ్యతిరేకత అంస్ సోషల్ మీడియా సృష్టే: చామలతా బీఆర్ఎ
- సర్పంచ్ పదవి ఆశిస్తున్న నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని పిలుపు
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, బయట కనబడుతున్న వ్యతిరేకత అంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా సృష్టేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఇతర పథకాల్లో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారని ఆయన పేర్కొన్నారు. తాము కొత్త పథకాలపై ఫోకస్ చేస్తుంటే, బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో చామల మీడియాతో చిట్ చాట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీకి చెందిన 65 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ కోరిందని చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులు వాళ్లకే తెలుసుని అభిప్రాయపడ్డారు. అయితే సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే నేతలు... ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, రుణమాఫీ, ఇతర పథకాలపై ప్రజలకు వివరించాలని సూచించారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నా
నిఖార్సైన పార్టీ కార్యకర్తగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నానని ఎంపీ చామల అన్నారు. గతంలో పార్టీ నుంచి ఎంపీలుగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పీసీసీ పదవుల్లో పనిచేశారని గుర్తుచేశారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ సమాలోచనలు చేస్తోందని, సమయాన్ని బట్టి మంత్రిమండలిని విస్తరిస్తారని చెప్పారు.