హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతున్నదని, దీనిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మరని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు తెలంగాణలోకి రాబోతున్నాయన్నారు. పెద్ద సంఖ్యలో ఐటీ, ఫార్మా, ఇతర కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించామని చెప్పారు.
అమర రాజా కంపెనీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో పదేండ్లపాటు కుటుంబ పాలన సాగిందని, ఒక్క ఫ్యామిలీనే అన్ని రకాల పదవులు అనుభవించిందన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాను పెంచిపోషిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నేతలు ఏమీ చేయలేదని, కేవలం ఎనిమిది నెలల్లోనే అన్నీ జరిగిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారన్నారు.