
- ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అంబేద్కర్‌కు బదులు భగవంతుని ప్రార్థిస్తే పుణ్యం దక్కుతుందని మాట్లాడారని, దీనిపై అమిత్ షా ఇంత వరకు క్షమాపణ చెప్పలేదని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే అమిత్ షాతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి జీవీకే సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల వేసి నివాళి అర్పించారని, అంబేద్కర్జయంతికి ఒక్కరోజు ముందు అలా చేస్తే వారికి అంబేద్కర్ పై చిత్తశుద్ధి ఉందని, బీజేపీ నేతలు అంబేద్కర్ అడుగు జాడల్లో ముందుకెళ్తున్నట్టు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తుందన్నారు. అంబేద్కర్ ను ఎవరు విస్మరించారో తెలంగాణ ప్రజలందరికి తెలుసనని పేర్కొన్నారు. బీజేపీ నేతలు పార్లమెంటులో పదేండ్లుగా ఇష్టానుసారంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో రాసిన సెక్యులర్అనే పదాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ డ్రామాలు బంద్ చేయాలన్నారు.