
- ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుంటే ఇక్కడి జనం బీజేపీ నేతలను నిలదీయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం బీజేపీకి అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయంటే ఇక్కడి బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో విఫలం కావాలనేది ఆ పార్టీ నేతల తపన తప్ప మరొకటి కాదని విమర్శించారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కేవలం గుర్తింపు కోసం తమ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ పై విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. మోదీ చేతగాని పాలనపై కూడా ఆయన మాట్లాడాలన్నారు. అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డి సస్పెండ్ అనేది బీఆర్ఎస్ నేతలకు విస్కీలో సోడా మిస్ అయితే ఎలా ఉంటుందో అంత బాధగా ఉంటుందన్నారు. దళిత స్పీకర్ ను బీఆర్ఎస్ అవమానపరిచిందని, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని కేటీఆర్ అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళితులను అడుగడుగునా అవమానపరిచిన చరిత్ర బీఆర్ఎస్ దేనని చామల దుయ్యబట్టారు.