
- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శ
హైదరాబాద్, వెలుగు: తీహర్ జైలు నుంచి వచ్చిన తర్వాత జనంలో కనిపించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తాపత్రయపడుతున్నారని, అందుకే జ్యోతిబా ఫూలే పేరుపై దీక్ష చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కట్టిన ప్రగతి భవన్ కంచెను కూల్చి, దానికి జ్యోతిబాఫూలే పేరు పెట్టిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. "ప్రతిపక్ష హోదాలో ఉన్న మీ నాయన బయటకు రారు.మీరు బయటుండి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు"అని కవితపై ఫైర్ అయ్యారు.
కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ పోరులో కవిత వెనుకబడిపోయారని, అందుకే అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టాలంటూ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఫూలే విగ్రహం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డిని ఇరికించిన కేటీఆర్
హెచ్‌సీయూ భూములపై కేటీఆర్ పెట్టిన ఫొటోలను నమ్మి స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని, చివరకు ఆయన తన ఖాతా నుంచి ఆ ఫొటోలను తొలగించేశారని చామల విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో కేంద్ర మంత్రిని ఇరికించిన ఘనత కేటీఆర్ దేనని ఎద్దేవా చేశారు. ఏఐతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండని కేటీఆర్ పై మండిపడ్డారు. కేటీఆర్,రేవంత్ రెడ్డి ఒకటేనని బండి సంజయ్ చేసిన విమర్శలను ఖండించారు. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జరిగిన సమావేశంలో పాల్గొంటే ఇద్దరూ ఒక్కటైనట్లేనా అని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.