
ఈ బిల్లుతో రాజ్యాంగాన్ని నీరుగారుస్తున్నారు:కాంగ్రెస్ఎంపీ గొగోయ్
ఇండియా కూటమి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నదని వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని నిబంధనలను నీరుగారుస్తున్నదని అన్నారు. మైనార్టీలను కించపరిచేలా, వారి హక్కులను తొలగించేలా.. సమాజాన్ని విభజించే లక్ష్యంతో బిల్లులో సవరణలు చేశారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా గౌరవ్ గొగోయ్ మాట్లాడారు.
పార్లమెంట్‌ను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, ఈ విషయంలో గతంలో చర్చించిన విషయాలను ప్రస్తావించిందని అన్నారు. ఈ బిల్లుపై మైనార్టీ ప్రతినిధులతో సరిగ్గా చర్చించలేదని తెలిపారు.
‘మైనార్టీలు ఇప్పుడు తమ మతపరమైన గుర్తింపును సర్టిఫికెట్లతో నిరూపించుకోవాలని బలవంతం చేస్తున్నారు. రేపు, ఇతర మతాల ప్రజలు కూడా ఇలా చేయాల్సిందేనా? ఇది ఆర్టికల్ 26 కి విరుద్ధం” అని పేర్కొన్నారు. ఈ బిల్లు మహిళల హక్కులపై చూపే ప్రభావం గురించి ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని గొగోయ్ ఆరోపించారు. ప్రతిపక్షాల సూచనలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.
ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉన్నయ్: రవిశంకర్
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు. పెద్ద సంఖ్యలో వక్ఫ్ ఆస్తులు ఖాళీగా ఉండి దోపిడీకి గురవుతున్నప్పుడు.. దానిని నియంత్రించడానికి ఒక చట్టాన్ని తీసుకువచ్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఎన్క్రోచ్మెంట్స్తో సమస్యలు ఎదుర్కొంటున్నందున చర్చి సమాజం కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నదని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల విషయంలో నిరంతరాయంగా అవినీతి జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోలేదని అన్నారు. వక్ఫ్ పరిపాలనలో పారదర్శకత, న్యాయాన్ని నిర్ధారించడానికి సవరణలు అవసరమని ప్రసాద్ తెలిపారు.
అఖిలేశ్ వర్సెస్ అమిత్‌షా
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఇంతవరకు తమ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. దీనికి కేంద్ర మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. ప్రతిపక్ష పార్టీల్లో అధ్యక్షులను కేవలం కుటుంబ సభ్యుల నుంచే ఎన్నుకుంటారు. కానీ, బీజేపీలో 12–13 కోట్ల మంది సభ్యులతో అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. కాబట్టి సమయం పడుతుందని చెప్పారు. ‘‘మీ పార్టీ విషయంలో మాత్రం ఆలస్యం ఉండదు.. మీరే 25 ఏండ్లు అధ్యక్షుడిగా ఉంటారు” అని అఖిలేశ్‌కు చురకలంటించారు.