తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నా.. లేనట్లేనని, ఆయనకు సబ్జెక్టు లేదన్నారు. సీఎం కేసీఆర్ జ్వరంతో ఉంటే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వైరల్ ఫివర్ నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు కోమటిరెడ్డి.
ALSO READ : బీఆర్ఎస్ లోకి సర్పంచులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా కొత్తగా ఎన్ని స్కీమ్ లు వదిలినా ప్రజలు నమ్మరని చెప్పారు. దళితుల భూములను లాక్కున్న ఘనత కేసీఆర్ దే అన్నారు. కర్ణాటకలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను తనతో వస్తే తీసుకెళ్లి చూపిస్తానని, స్పెషల్ ఫ్లైట్ పెడుతానని చెప్పారు. కాంగ్రెస్ లో కొత్త మనోహర్ రెడ్డి ఎవరో తనకు తెల్వదన్నారు. అరున్నర అడుగులు ఉన్న హరీష్ రావు తమ పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. దళిత బంధులో 30 పర్సెంట్ కమీషన్ గురించి చెప్పవా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే బొందల రాష్ట్ర సమితి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఎందుకు పొటీ చేయవని ప్రశ్నించారు.
కాంగ్రెస్ వాళ్లు రూ.10 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ హరీష్ రావు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 24 గంటల పాటు కరెంటు ఇస్తే తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనని స్పష్టం చేశారు. వరి పంటలు కోతకు వస్తున్న సమయంలో.. కరెంట్ లేక పంట చెన్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి సరిగా వానలు లేవని, కరెంటు ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను వంద రోజుల్లో నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ హామీలు అమలు చేయకపోతే.. తమలాంటి వాళ్లు ప్రభుత్వంలో నుంచి వెళ్లిపోతామన్నారు. కేసీఆర్ మాదిరిగా దుబారా ఖర్చులు చేయబోమన్నారు. దళితులకు రూ.10 లక్షలు ఇచ్చే సరికి ఎంత టైం పడుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ఉద్యోగుల జీతాలు ప్రతినెల15వ తేదీ ఇస్తున్నారని చెప్పారు. ఝార్ఖండ్ వంటి రాష్ట్రంలో 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని చెప్పారు. ధనిక రాష్ట్రం తెలంగాణలో 16 నెలల నుంచి 1వ తేదీనే జీతాలు పడడం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా డబ్బులు దోచుకున్నారని, ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే.. ఐటీ విషయంలో ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చేవని, బీఆర్ఎస్ వాళ్ల తీరుతో కొన్ని కంపెనీలు వెనక్కి పోయాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, సెజ్ ల వాళ్ల హైదరాబాద్ అభివృద్ధి జరుగుతోందన్నారు. పరీక్షల నిర్వాహణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ ) పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పరీక్ష నిర్వహణ చేత కావడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. పారదర్శకంగా పరీక్షలను నిర్వహిస్తామన్నారు.