ఎన్నికలకు నెల ముందు కార్యాచరణ ప్రకటిస్తా : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి

నల్గొండ ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్త
ఏ పార్టీ నుంచి అనేది ఎన్నికలప్పుడే తెలుస్తది
ప్రధాని మోడీతో 20 నిమిషాలపాటు భేటీ
మూసీ, ఎంఎంటీఎస్‌‌‌‌ తదితర అంశాలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఎన్నికలకు ఒక నెల ముందు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి చెప్పారు. ‘‘అప్పటి పరిస్థితులను బట్టి ఎన్నికల్లో పోటీ గురించి మాట్లాడుతా. ఎక్కడి నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది వెల్లడిస్త. నల్గొండ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడం ఫైనల్. అయితే ఏ పార్టీ నుంచి అనేది అప్పుడే తెలుస్తుంది. కేసీఆర్ మే నెలలో ముందస్తుకు పోతే, ఏప్రిల్‌‌‌‌లో మీడియాకు నా విధానాన్ని చెప్త” అని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో వెంకట్‌‌‌‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తర్వాత తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మోడీతో చర్చించినట్లు చెప్పారు. అడిగిన మూడు రోజుల్లోనే అపాయింట్‌‌‌‌మెంట్ ఇచ్చిన మోడీకి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఛీఛీ.. ఏం కమిటీలు

ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం వేసిన ఏ కమిటీల్లోనూ తాను లేనని, కేవలం లోక్ సభ సభ్యుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని ఎంపీ వెంకట్‌‌‌‌రెడ్డి చెప్పారు. అందుకే తాను ఫ్రీబర్డ్ అని, ఏ కమిటీలో లేనందున తనను పార్టీ గురించి అడగొద్దని అన్నారు. తాను స్టార్ క్యాంపెయినర్‌‌‌‌‌‌‌‌ను కాదని చెప్పారు. ‘ఛీఛీ ఎవరు వేసిన కమిటీలు? ఏం కమిటీలు? మంత్రి పదవిని కాలి చెప్పుతో సమానంగా వదిలేశా” అని ఫైర్ అయ్యారు. ఏఐసీసీ చీఫ్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన ఖర్గేను కలిసి అభినందనలు తెలిపానన్నారు.

కాంగ్రెస్ ఎంపీగా 30 వేల కోట్లు మిగిల్చిన

‘‘గతంలో నైనీ కోల్ బ్లాక్‌‌‌‌ను సింగరేణికి కేంద్రం కేటాయించింది. ఇందులో జాయింట్ వెంచర్ అనే క్లాజ్ తొలగించి, సింగరేణి వింగ్‌‌‌‌గా ఏర్పడి కేసీఆర్ బంధువుకు టెండర్ కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ విషయం గురించి కేంద్రానికి తెలియజేసి.. వాళ్ల ప్రయత్నాలను ఆపి.. ఓ కాంగ్రెస్ ఎంపీగా రూ.30 వేల కోట్లను దేశానికి, సింగరేణికి మిగిల్చిన” అని వెంకట్‌‌‌‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో ప్రధాని తనను అభినందించారని తెలిపారు.

సబర్మతిలా మూసీని మార్చండి

మోడీతో భేటీలో మూసీ నది కాలుష్యంపై చర్చించినట్లు వెంకట్‌‌‌‌రెడ్డి తెలిపారు. గుజరాత్‌‌‌‌లోని సబర్మతి నదిలా మూసీ రూపురేఖలు మార్చాలని కోరినట్లు చెప్పారు. నమామి గంగే మాదిరిగా ప్రక్షాళన చేపట్టాలని, ఇందుకు పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు. ఒకప్పుడు తాగు, సాగు నీరు అందించిన మూసీ.. పాలకుల నిర్లక్ష్యంతో విషమయం అయిందన్నారు. నదిలో డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల లక్షల మంది అనారోగ్యం పాలువుతున్నారని ప్రధాని దృష్టికి తెసుకెళ్లానన్నారు. స్పందించిన మోడీ.. మూసీ ప్రక్షాళనపై త్వరలోనే ఓ కమిటీ వేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్– విజయవాడ ఎన్ హెచ్ –65 విస్తరణపై ప్రధానితో చర్చించానని, రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని వెంకట్‌‌‌‌రెడ్డి తెలిపారు. జనగామ, భువనగిరి మధ్య ఎంఎంటీఎస్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. అవసరమైతే 20 రోజుల్లో మరోసారి మోడీని కలుస్తానని పేర్కొన్నారు. యాదగిరి గుట్టకు ఎంఎంటీఎస్ విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.90 కోట్లు చెల్లించేలా కేసీఆర్ అపాయింట్‌‌‌‌మెంట్ కూడా కోరుతానని తెలిపారు.