బలహీన వర్గాల కోసమే ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నం: ఎంపీ మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా రక్తపాతం లేని పాలనకు శ్రీకారం చుట్టినట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశంలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అయితే, బీజీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. సుభాషితాలు చెప్పడం తప్ప, దేశ ప్రజల కోసం పని చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అతి చేసి, రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కొల్పోయే స్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు.
శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్‌లో కేటీఆర్ బాధ్యుడు కాబట్టి ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. తమకు అసెంబ్లీలో కొంత బలం ఉందనే ధైర్యంతో సభను నడవకుండా అడ్డుకుంటామనడం దురదృష్టకరమన్నారు.
ఫార్ములాఈ రేస్ కేసులో ఆధారాలు సేకరించాకే విచారణ మొదలైందని ఆయన స్పష్టం చేశారు. మురికి కూపంగా ఉన్న హైదరాబాద్‌ను కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు కమిటీ వేశారని గుర్తుచేశారు. అదానీ, మణిపూర్, దేశంలోని అల్లర్లపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ప్రధాని మోదీ, అమిత్ షా పార్లమెంట్‌కు రావడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్‌ను బద్నాం చేసే కుట్ర: ఎంపీ చామల
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను సజావుగా నడపలేక ఆ వైఫల్యాన్ని కాంగ్రెస్‌పై నెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదానీ, సంబాల్, మణిపూర్ సహా ప్రజా సమస్యలపై చర్చ జరపాలని తాము డిమాండ్ చేస్తే, ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అంబేద్కర్ పేరు పలకడమే తప్పన్నట్లు హోం మంత్రి అమిత్ షా మాట్లాడి దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు.
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసింది నిజమే అనేటట్లు బీజేపీ వ్యవహారశైలి ఉందని విమర్శించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చుంటే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవారన్నారు. 2/3 మెజారిటీ లేనిది జమిలి బిల్లు పాస్ కాదని తెలిసి కూడా తూతూ మంత్రంగా జమిలి బిల్లు పార్లమెంట్‌లో పెట్టి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.