- ఎంపీ మల్లు రవి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే అదే సమయంలో తెలంగాణ కోసం పోరాడిన గద్దర్‌కు కూడా అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కోరారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ఈ నాయకుల తీరుపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అందరూ సవ్యసాచి అని పిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధిని, ఇంకో వైపు రాజకీయాలను సమానంగా నడిపిస్తూ, అభివృద్ధి ఎంత అవసరమో.. రాజకీయాలు అంతే ముఖ్యమనే విషయాన్ని రేవంత్ గుర్తించారన్నారు. రేవంత్ తక్కువ కాలంలోనే జాతీయ స్థాయిలో సమర్థ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు.