కేంద్ర పథకాలకు బీజేపీ నేతల పేర్లు ఎట్ల పెడ్తరు? : మల్లు రవి

కేంద్ర పథకాలకు బీజేపీ నేతల పేర్లు ఎట్ల పెడ్తరు? : మల్లు రవి
  • ఇందిరమ్మ ఇండ్లపై బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవా లి: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే వాటిని రద్దు చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు బీజేపీ నేతల పేర్లు ఎలా పెడతారని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫెడరల్ వ్యవస్థను బీజేపీ నేతలు గౌరవించడం లేదనడానికి సంజయ్ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 

ఇలాంటి తీరుతో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తెలంగాణ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌరవించినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా కేంద్ర మంత్రులు గౌరవించాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అన్ని గ్రామాల్లో కొత్తగా ప్రకటించిన 4 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న పేరును నిలబెట్టేందుకు హైడ్రా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్లడించారు. ముఖ్యంగా సామాజిక సమానత్వం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నదని పేర్కొన్నారు.