- పదేండ్లలో కేసీఆర్ చేయలేనివి ఏడాదిలోనే చేసి చూపినం: మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: ప్రభుత్వ పాలన, ప్రజా సంక్షేమానికి అడ్డువస్తే కేసీఆర్ నైనా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కౌశిక్ రెడ్డిని అందుకే అరెస్టు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. పదేండ్లలో తనను ఎన్నోసార్లు హౌస్అరెస్టు చేశారని, ఇప్పడేమో ఎమ్మెల్సీ కవితను హౌస్ అరెస్టు చేశారని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తున్నదని విమర్శించారు. ఇందిరాపార్కు దగ్గర సమావేశాలు, ధర్నాలు, ప్రసంగాలు చేసుకోవచ్చని, తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు.
కానీ, అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో.. బీజేపీ చేపట్టిన మూసీ నిద్రను అడ్డుకోలేదని, మీటింగ్ కు పర్మిషన్ ఇచ్చామన్నారు. కానీ కేసీఆర్ పాలనలో ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కోర్టులకు పోయి మీటింగ్ లకు పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. పదేండ్లలో కేసీఆర్ చేయలేని అభివృద్ధిని కేవలం ఏడాదిలోనే తాము చేసి చూపించామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర చట్టం తెవాలని, పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని వెల్లడించారు.
అదానీని రక్షించేందుకే పార్లమెంట్ వాయిదా..
అదానీ ముడుపుల వ్యవహారంపై సభలో చర్చకు అవకాశం ఇస్తే.. మోదీ, అదానీ లింక్ బయటపడుతుందని ఎన్డీఏ సర్కార్ భయపడుతుందని ఎంపీ మల్లు రవి అన్నారు. అందుకే అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ కరెన్సీ డ్రామను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.
దేశంలో పేరున్న న్యాయవాదుల్లో అభిషేక్ మను సింఘ్వీ ఒకరని, ఆయన నిజాయితీ దేశానికి తెలుసని చెప్పారు. అసలు డబ్బుల కట్టను తీసుకొచ్చి సీటుదగ్గర వదిలి వెళ్లాల్సిన అవసరం ఆయనకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. అదానీని రక్షించడానికి బీజేపీ ప్రభుత్వం అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉందన్నారు.