ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తం : రాహుల్ గాంధీ

ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తం : రాహుల్ గాంధీ
  • రైతుల హక్కుల కోసం పోరాడతం
  • రైతు నేతల బృందంతో రాహుల్ సమావేశం

న్యూఢిల్లీ: ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత కోసం ఎన్డీయే ప్రభుత్వంపై ఇండియా కూటమి ఒత్తిడి తెస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఆయనను పార్లమెంట్ కాంప్లెక్స్‌‌లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతు నాయకుల బృందం కలిసింది. వారు  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ కు వివరించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ.." ఇండియా కూటమి మేనిఫెస్టో ఎంఎస్‌‌పీకి చట్టపరమైన హామీ ఇచ్చింది. మేం పూర్తి అంచనాతోనే ఆ హామీ ఇచ్చాం.

అది కచ్చితంగా సాధ్యమవుతుంది. దీనిపై ఇండియా బ్లాక్ నాయకులతో మరోసారి చర్చించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత అనేది రైతుల హక్కు. రైతులు ఈ హక్కును పొందేలా ఇండియా కూటమి పార్లమెంట్ లో  పోరాడుతుంది" అని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌ మాట్లాడుతూ..కోట్లాది మంది రైతులకు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆశాకిరణమని అన్నారు. రైతులను మోదీ సర్కార్ లాఠీలతో కొట్టిందని..వారిపై తూటాలు పేల్చిందని గుర్తుచేశారు. దాంతో  ప్రభుత్వంపై రైతులు విశ్వాసం కోల్పోయారని తెలిపారు. రైతుల సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తామని పేర్కొన్నారు. 

ఢిల్లీకి మార్చ్‌‌ చేస్తం: రైతులు

రాహుల్ ను కలిసిన తర్వాత రైతు నేతలు మాట్లాడుతూ.. ‘‘మేం రాహుల్ గాంధీని కలిశాం. ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత డిమాండ్‌‌పై చర్చించాం. ఇండియా బ్లాక్ భాగస్వాములు పార్లమెంట్​లో రైతుల సమస్యలను లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. ఎంఎస్‌‌పీ అనే దీర్ఘకాలిక డిమాండ్‌‌ పరిష్కారం కోసం ప్రైవేట్ మెంబర్స్ బిల్లును ప్రవేశపెట్టాలని రాహుల్​ను కోరాం. ఇచ్చిన హామీలను  నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం  విఫలమైంది. స్వామినాథన్ నివేదిక తప్పనిసరిగా అమలు చేయాలి. లేకుంటే ఢిల్లీ మార్చ్‌‌ నిరసన చేపడతాం"  అని పేర్కొన్నారు. రైతులతో జరిగిన ఈ సమావేశంలో  పంజాబ్‌‌ మాజీ సీఎం చరణ్‌‌జిత్‌‌ సింగ్‌‌ చన్నీ, పంజాబ్‌‌ కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ అమరీందర్‌‌ సింగ్‌‌ రాజా వారింగ్‌‌, సుఖ్‌‌జీందర్‌‌ సింగ్‌‌ రంధావా తదితరులు పాల్గొన్నారు.