యమునా నీళ్లు తాగు.. ఆస్పత్రికి వచ్చి కలుస్తా: కేజ్రీవాల్‎పై రాహుల్ సెటైర్లు

యమునా నీళ్లు తాగు.. ఆస్పత్రికి వచ్చి కలుస్తా: కేజ్రీవాల్‎పై రాహుల్ సెటైర్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్​అర్వింద్ కేజ్రీవాల్‌‌పై సెటైర్లు వేశారు. ఐదేండ్లలోపు యమునా నదిని శుభ్రం చేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు.. యమునా నదిలో నీళ్లు తాగాలని సవాలు చేశారు. ఆ తర్వాత తాను ఆస్పత్రికి వచ్చి కలుస్తానని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని హౌజ్ ఖాజీ చౌక్‌‌లో జరిగిన బహిరంగ  సభలో రాహుల్ పాల్గొని మాట్లాడారు. 

“కేజ్రీవాల్.. కొత్త రాజకీయ వ్యవస్థను తీసుకువస్తానని, అవినీతిని అంతం చేస్తానని హామీ ఇచ్చారు. ఐదు సంవత్సరాలలోపు యమునా నదిని శుభ్రం చేసి అందులో స్నానం చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. కానీ, నది మురికిగానే ఉంది. ఆ నీటిని తాగమని నేను కేజ్రీవాల్‎ను సవాలు చేస్తున్నాను” అని రాహుల్ గాంధీ అన్నారు.

‘‘మనీశ్ సిసోడియా, అతిశీ, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, సత్యేంద్ర జైన్‌‌ ఈ తొమ్మిది మంది కేజ్రీవాల్ ప్రధాన బృందం. కానీ, వారిలో అణగారిన వర్గాలకు చెందినవారు ఎంతమంది?" అని ఆయన వ్యాఖ్యానించారు.“కేజ్రీవాల్, మోదీ మధ్య ఎలాంటి తేడా లేదు. మోదీ బహిరంగంగా మాట్లాడుతారు. కానీ, కేజ్రీవాల్ మౌనంగా ఉంటారు. అవసరమైనప్పుడు కనిపించకుండా పోతారు” అని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికలను రాహుల్ గాంధీ రెండు వ్యతిరేక సిద్ధాంతాల మధ్య యుద్ధంగా అభివర్ణించారు.

“ఈ పోరాటం రెండు సిద్ధాంతాల మధ్య. ఒకటి బీజేపీ -ఆర్ఎస్ఎస్. ఇది ద్వేషాన్ని సూచిస్తుంది. మరొకటి కాంగ్రెస్. ఇది ఐక్యతను సూచిస్తుంది. ఈ రోజు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. కానీ, ఆయన పదవీ విరమణ చేసిన రోజు ఎవరూ ఆయనను గుర్తుంచుకోరు. చరిత్ర మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులను మాత్రమే గుర్తుంచుకుంటుంది, గాడ్సేను కాదు" అని రాహుల్​పేర్కొన్నారు.