డ్యాన్స్ ప్రోగ్రాంలా అయోధ్య గుడి ప్రారంభం: రాహుల్ గాంధీ

డ్యాన్స్ ప్రోగ్రాంలా అయోధ్య గుడి ప్రారంభం: రాహుల్ గాంధీ
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా పిలవలే: రాహుల్​ గాంధీ
  • అంబానీ, అదానీ, అమితాబ్ ​లాంటి పెద్దలకే ఆహ్వానం
  • హర్యానాలోని హిసార్ ర్యాలీలో ఎంపీ ప్రసంగం

చండీగఢ్: అయోధ్య రామమందిరంపై లోక్​సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ​గాంధీ చేసిన కామెంట్స్​మరోసారి వివాదాస్పదంగా మారాయి. బాలరాముడి ప్రతిష్ఠాపనోత్సవం కేవలం నాచ్​గానా(ఆటపాట) అని రాహుల్ ​గాంధీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ సర్కారు పిలువలేదని, కానీ ముకేశ్​అంబానీ, అదానీ, అమితాబచ్చన్​లాంటి పెద్దలను ఆహ్వానించిందని అన్నారు. 

హర్యానాలోని హిసార్​లో శనివారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో రాహుల్​ గాంధీ మాట్లాడారు. ‘‘అయోధ్య రామమందిరం ప్రారంభమైనప్పుడు మీరు అక్కడ అదానీ, అంబానీ, అమితాబచ్చన్​ను చూశారు. కానీ.. ఒక్క రైతు, కూలీ, కార్మికుడుగానీ కనిపించాడా? అక్కడ జరిగింది ఓ ఆటపాట మాత్రమే. ఆ ఉత్సవంలో శ్రామికవర్గానికి ప్రాతినిధ్యమే లేదు” అని అన్నారు. అలాంటి జాతీయ ఉత్సవంలో రైతులు, కార్మికులను విస్మరించడం సామాన్య ప్రజలపై బీజేపీకి ఉన్న బంధాన్ని ప్రతిబింబిస్తున్నదని అన్నారు.

హర్యానా దశాబ్దాల కష్టాలను తీరుస్తం

హర్యానాలో రాబోయే కాంగ్రెస్​ సర్కారు దశాబ్దాల కష్టాలను తీరుస్తుందని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని చెప్పారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్​ పార్టీ రెండో విడత మేనిఫెస్టోను ప్రకటించిన సందర్భంగా ట్విట్టర్​(ఎక్స్​)లో రాహుల్ ​గాంధీ ఓ పోస్ట్ పెట్టారు. పదేండ్లలో హర్యానా కలలు, శక్తి, భవిష్యత్తును బీజేపీ లాక్కున్నదని ధ్వజమెత్తారు. 

అగ్నివీర్ ​పథకం.. దేశభక్తిగల యువత ఆకాంక్షలను, నిరుద్యోగం.. కుటుంబాల నవ్వును, ద్రవ్యోల్బణం.. మహిళల స్వాలంబనను దూరం చేశాయన్నారు. నల్లచట్టాలను తీసుకొచ్చి, రైతుల హక్కులను హరించే ప్రయత్నం చేశారని, జీఎస్టీ ద్వారా లక్షలాది మంది చిరువ్యాపారుల లాభాలను కొల్లగొట్టారని ఆరోపించారు. వారు(బీజేపీ) తమ స్నేహితులకు లాభం చేకూర్చేందుకు హర్యానా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 

హర్యానాలో రాబోయేది కాంగ్రెస్ ​సర్కారేనని, ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు.  పొదుపు నుంచి ఆరోగ్యం, సామాజిక భద్రత హక్కుల పరిరక్షణ, ఉపాధి కల్పన, ప్రతి కుటుంబంలో సంతోషం అనేవి కాంగ్రెస్​ గ్యారంటీలని చెప్పారు.