కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం రైతులకు నష్టమే

హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం రైతులకు నష్టమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమన్నారు. రైతులను, రైతు సంఘాలను అడగకుండా తీసుకువచ్చిన ఈ చట్టాన్ని.. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని రేవంత్‌ పేర్కొన్నారు.

ఈ చట్టం వ్యతిరేకంగా ప్రతి డివిజన్, గ్రామంలో కోటి సంతకాలు సేకరించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.కాంగ్రెస్ తీసుకువచ్చిన కనీస మద్దతు ధర చట్టాన్ని రద్దు చేయడం అన్యాయమ‌ని, ఈ చట్టాన్ని నల్ల చట్టంగా (బ్లాక్ బిల్లు)గా అభివర్ణించారు. రాష్ట్రంలో నిర్బంధ వ్యవసాయ విధానాన్ని ఉపసంహరించుకోవాలని.. ఆఖరి గింజ వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

షాపూర్ నగర్‌లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రేవంత్‌ తెలిపారు. వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రానికి సమర్పిస్తామని తెలిపారు.