మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారం, ధన బలంతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు, మద్యం బాటిళ్లను విచ్చలవిడిగా పంచుతున్నారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్య వంతులని..ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓటు అనే ఆయుధంతో అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
కాంగ్రెస్ కార్యకర్తలను కొనుగోలు చేస్తున్నరు
అధికారం, ధన బలంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ కార్యకర్తలను కొనుగోలు చేయడంపై ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట వినని వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ తమ దారికి తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు.ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు మునుగోడు ఓటర్లను మభ్యపెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రులు కూడా మునుగోడులో గ్రామాలను దత్తత తీసుకుంటూ ప్రలోభాలకు తెరతీయడం సరికాదన్నారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. ప్రలోభాలు పెట్టి గెలిచిన నాయకుడు ప్రజలకు ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు.
మునుగోడులో ధనస్వామ్యాన్ని చూపిస్తున్నరు
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలను పంచిపెడుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, సీనియర్లు మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ తెలంగాణపై మిడతల దండులా దాడి చేస్తున్నారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డిని ప్రజలు నిలదీస్తున్న వీడియోను చూస్తుంటే..అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా కార్లు, మోటార్ సైకిళ్లు, బంగారం, డబ్బును పంచుతూ ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.