కేటీఆర్​ను అసెంబ్లీకి రానివ్వొద్దు .. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు ఫైర్

కేటీఆర్​ను అసెంబ్లీకి రానివ్వొద్దు .. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు ఫైర్
  • సీఎం, సభ గౌరవాన్ని కించపర్చుతున్నరు
  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: కేటీఆర్​ను అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కించపర్చేలా కామెంట్లు చేసిన కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​బాబును కోరారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, రఘురామిరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్ అవమానించిండు. ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కుతున్నడు. పాత రోజుల్లో దొరలు ప్రదర్శించినట్టు అహంకారపూరితంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నడు. బంగారు తెలంగాణే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై 14 నెలలుగా బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నది’’అని ఎంపీలు అన్నారు.

తెలంగాణపై కేంద్రం రాజకీయాలు చేస్తున్నది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణతో కేంద్రం రాజకీయాలు చేస్తున్నదని, దీన్ని ప్రజలు గమనించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సామాజిక న్యాయం దిశగా కేంద్రం పనిచేయడం లేదన్నారు. జనాభాకి అనుగుణంగా కేంద్రం నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమానికి రూ.1.65 లక్షల కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.1.20 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఈ లెక్కలు పరిశీలిస్తే.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ బడ్జెట్ 5 శాతం దాటలేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ పెంచాలని పార్లమెంట్ లో పోరాడతామని స్పష్టం చేశారు.

నిధులు అడిగితే హేళన చేస్తారా?: ఎంపీ చామల

తెలంగాణ ప్రజల కోసం తాము నిధులు అడిగితే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నవ్వు రావడం ఆయన నిజ బుద్ధికి నిదర్శనమని ఎంపీ చామల అన్నారు. తెలంగాణకు సాయం చేయాల్సిందిపోయి, హేళనగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని, ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోరా? అని నిలదీశారు. పదేండ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుంటుంటే కిషన్ రెడ్డి పట్టించుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవడాన్ని కిషన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మరోవైపు 14 నెలలుగా అసెంబ్లీకి రాని వ్యక్తి దిశానిర్దేశం చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేసీఆర్ ను ఉద్దేశించి చామల కౌంటర్ ఇచ్చారు. 

తెలంగాణను అప్పులకుప్పగా మార్చినందుకు రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా, ఎద్దులు, దున్నపోతుల గురించి మాట్లాడడం పక్కనపెట్టి ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక సలహాలు, సూచనలివ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించడం హర్షణీయమని ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి అన్నారు. జూన్ 2లోపు ఐదు లక్షల మందికి దీన్ని అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత పదేండ్లలో కేసీఆర్ సహా మంత్రులెవరూ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడలేదని చెప్పారు.