- కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం
- తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని డిమాండ్
- రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోలే: మల్లు రవి
- కిషన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే: కడియం కావ్య
- విభజన చట్టం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: చామల
- రాష్ట్రానికి న్యాయంచేయాలని మోదీ, నిర్మలకు లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రజల నమ్మకాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా.. న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే బీజేపీ ఎంపీలంతా తమతో కలిసి న్యాయ పోరాటానికి రావాలని సూచించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే.. కేంద్రంపై ఒత్తిడి పెరిగి, రాష్ట్రానికి నిధులు వస్తాయన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ఎంపీలు మీడియా తో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి సూచనల ప్రకారం ఢిల్లీలో ఉద్యమ కార్యాచరణ ఉంటుందని మల్లు రవి తెలిపారు. ‘బడ్జెట్‌లో వెనుకబడిన రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోలేదు. ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగించారు’ అని అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్.. పదేండ్లలో ఏం చేసిందని ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నించారు. పదేండ్లుగా ఏపీని పట్టించుకోని ప్రధాని మోదీ.. ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆంధ్రకు నిధులు కేటాయించారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి, నిధుల కోసం అవసరమైతే కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపులపై ఢిల్లీలో ధర్నాకు సిద్ధమా? అని ప్రశ్నించిన కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ కలిసి వస్తే తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీలు గాజులు తొడుక్కున్నారా?: రఘురామి రెడ్డి
లోక్‌సభలో బీజేపీ ఎంపీలు చేతులు కట్టుకుని కూర్చొన్నారని రఘురామి రెడ్డి విమర్శించారు. తెలంగాణకు ఏం ముఖం పెట్టుకుని వెళ్తారని నిలదీశారు. గాజులు వేసుకున్నారా? అని బీజేపీ ఎంపీలపై ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని తన కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్‌లో ఏపీ, బీహార్‌కు పెద్దమొత్తంలో నిధులు కేటాయించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2014 నుంచి విభజన చట్టం ఉందని, అప్పటి నుంచి లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్‌లోనే ఎందుకు చేశారని ప్రశ్నించారు.
సింగరేణిలో ఉద్యోగాలు ఎందుకు తగ్గినయ్?:కావ్య
సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సభావేదికగా అబద్ధాలు చెప్పారని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరించకుంటే ఒకప్పుడు లక్ష ఉద్యోగులు ఉంటే.. ఇప్పుడు 50 వేలకు ఎందుకు పడిపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల టైంలో పలుమార్లు దక్షిణాదికి వచ్చిన మోదీ.. బడ్జెట్ లో మోసం చేశారన్నారు.