
- బీఆర్ఎస్, బీజేపీవి అభివృద్ధిని అడ్డుకునే రాజకీయం
- కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేశ్ షెట్కార్ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: అప్పుడు భూములు అమ్మిన వారే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేశ్ షెట్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను జీరో చేస్తారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఏడువేల ఎకరాల అటవీ భూమి సేకరించారని, ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందన్నారు.
గురువారం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో ఎంపీ మల్లు రవి, సురేశ్ షెట్కార్ మాట్లాడారు. ప్రతి దానికి బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ఫేజ్ 2, మూసీ ప్రక్షాళనకు కేంద్రం కలిసి రావాలన్నారు. 20 ఏండ్లుగా ఖాళీగా ఉన్నందునే హెచ్‌సీయూ భూముల్లో చెట్లు- పెరిగాయని పేర్కొన్నారు.
‘తెలంగాణ తన రాజ్యం అన్నట్లు- కేటీఆర్ ఫీల్ అవుతున్నాడు. తమకే అధికారం సొంతం అన్నట్లు-గా మాట్లాడుతున్నాడు. అది కరెక్టు కాదు. ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల్లో పార్కు నిర్మిస్తామని కేటీఆర్ చెబుతున్నారు. హైదరాబాద్ చుట్టు-పక్కల భూములు అమ్మొద్దని ఆందోళన చేసిన బీఆర్‌ఎస్.. అధికారం లోకి వచ్చాక రూ.లక్షల కోట్ల రూపాయల భూములను అమ్మేసింది.
కంచె గచ్చిబౌలి భూములు హెచ్‌సీయూవీ కాదు. ప్రైవేట్ వారికి కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది” అని ఎంపీలు చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరించారని వారు విమర్శించారు. కోర్టులో పోరాడిన తరువాత ఆ భూమి ప్రభుత్వ భూమి అయ్యిందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తామని తెలిపారు.