న్యూఢిల్లీ: జై భీం.. జై అంబేద్కర్ అంటూ పార్లమెంట్ ఆవరణ హోరెత్తింది. బీజేపీ ఎంపీలు మినహా కాంగ్రెస్, ఇతర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పార్లమెంట్ బిల్డింగ్ పైకి ఎక్కి.. అంబేద్కర్ ఫొటోలతో నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీలు. అంబేద్కర్ గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది.. అంబేద్కర్ పేరు కంటే.. దేవుడి పేరు స్మరించినా స్వర్గానికి వెళ్లేవారు అంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ఎంపీలు. పార్లమెంట్ ఆవరణలో.. పార్లమెంట్ బిల్డింగ్ పైకి ఎక్కి అంబేద్కర్ చిత్రపటాలతో జై భీం నినాదాలు చేశారు. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెబుతూ.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎంపీలు.
అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ను నిండు సభలో అమిత్ షా అవమానించారని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. 2024, డిసెంబర్ 19వ తేదీన పార్లమెంట్ భవనం ముందు కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల ఎంపీల పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంబేద్కర్ చిత్రపటాలను చేతిలో పట్టుకుని జై భీం.. జై జై భీం నినాదాలతో హోరెత్తించారు ఎంపీలు.
Also Read:-అంబేద్కర్పై అమిత్ షా మాట్లాడిన అవమానకర మాటలు ఇవే..
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బ్లూ కలర్ దుస్తులు ధరించి ఈ నిరనసల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. కుటుంబ స్వలాభం కోసం రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించి కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ను అవమానించిదని అధికార బీజేపీ పార్టీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన దిగారు. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది.
రంగంలోకి దిగిన మార్షల్స్, పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది సభ్యులను సముదాయించారు. ఈ ఆందోళనలో తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎంపీలు అందరూ పాల్గొన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరసన వ్యక్తం చేయటంతో పాటు.. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అమిత్ షా వెంటనే.. దళితులకు.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారాయన.