న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ సభకు వచ్చి అదానీ వ్యవహారంపై సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్ వద్ద మోదీ, -అదానీ మాస్క్ లు ధరించి నిరసన తెలిపారు. ఇందులో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మాణిక్కం ఠాగూర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ, అదానీ మాస్క్ లు ధరించిన ఇద్దరు ఎంపీలను రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేశారు.
అదానీ మాస్క్ ను మాణిక్కం ఠాగూర్ పెట్టుకోగా, మోదీ మాస్క్ ను శివాజీ రావు అధల్ రావు పాటిల్ పెట్టుకున్నారు. ఒక నిమిషానికి పైగా ఉన్న ఇంటర్వ్యూ వీడియోను సోషల్ మీడియాలో కాంగ్రెస్ షేర్ చేసింది. ఇందులో ‘ఈ రోజుల్లో ఏమి జరుగుతున్నది సోదరా?’ అంటూ అదానీ (మాణిక్కం ఠాగూర్)ని రాహుల్ ప్రశ్నిస్తారు. అప్పుడాయన మోదీ(శివాజీరావు)పై చేయి వేసి.. ‘నేను ఏది చెప్పినా ఇతను చేస్తాడు. నాకు ఏది కావాలంటే అది – అది ఎయిర్‌పోర్ట్ అయినా, పోర్ట్ అయినా’ అని బదులిస్తారు. దీనికి రాహుల్ స్పందిస్తూ.. ‘మీరు తదుపరి ఏమి అడుగుతున్నారు? అన్ని ప్రశ్నించగా.. ‘సాయంత్రం మీటింగ్ ఉంది’ అంటూ జవాబిస్తారు. అలాగే “మేము ఒకేలా ఉన్నాం. మేము ప్రతిదీ కలిసి చేస్తాం. మేం చాలా ఏండ్లు కలిసి ఉన్నాం’’ అంటూ ఠాగూర్ చెప్పిన మాటలు వీడియోలో ఉన్నాయి.